హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తనదైన శైలిలో విరుచుకు పడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వివరించినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కార్మికులకు అండగా ఉండాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందని తెలిపారు. 

ఇకపోతే తెలంగాణలో పరిపాలన సంక్షోభంలో పడిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణం సీఎం కేసీఆరేనని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్రం చేసిన చట్టం తమకు అవసరం లేదని అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంటే ముఖ్యమంత్రి మాత్రం అదే కావాలని పట్టుబడుతున్నారని తెలిపారు. 

ఆ చట్టం యెుక్క ఉద్దేశం, విధివిధానాలు వేరని చెప్పుకొచ్చారు. కానీ ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేలా కేసీఆర్ తీరు ఉందని అది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు లక్ష్మణ్.    

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సంస్థాగత జాతీయ ఎన్నికల అధికారి శ్రీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై డా.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. 

ఈ వార్తలు కూడా చదవండి

#RTC Strike భయపెట్టొద్దు.. చర్చలే అన్నింటికీ పరిష్కారం: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీని కేసీఆర్ ఏం చేయలేరు, కారణమిదే: ఆశ్వత్థామరెడ్డి