బీజేపీ నేతలపై టీఆర్ఎస్ భౌతికదాడులకు దిగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మహిళా న్యాయవాది ప్రసన్నపై దాడి చేయటం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది ప్రసన్నపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బీజేపీని (bjp) చూసి టీఆర్ఎస్ (trs) వణుకుతుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే బీజేపీ నేతలపై టీఆర్ఎస్ భౌతికదాడులకు దిగుతోందని సంజయ్ మండిపడ్డారు. మహిళా న్యాయవాది ప్రసన్నపై దాడి చేయటం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది ప్రసన్నపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కర్మాన్ ఘాట్‌లో గోరక్షక్ దళ్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. తల్వార్లు, ఐరన్ రాడ్లతో స్వైర విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. దాడులకు పాల్పడ్డ రోహింగ్యాలను అరెస్ట్ చేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ (kcr) కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. రాష్ట్రంలో సామాన్యులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ (ktr) వాస్తవాలను అవాస్తవాలుగా.. అబద్ధాలను నిజంగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని .. తమ మాట వినని మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. పార్టీలకు వ్యతిరేకంగా పేపర్లు, ఛానల్స్ పెట్టుకుని ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడిన అంశాలను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించిన పేపర్లు, ఛానెళ్లపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, వారు ఎన్ని చేసినా తెలంగాణలో తమ పార్టీ పాతుకుపోయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇకపోతే, రాష్ట్రంలో బీజేపీపై TRS దాడులకు సంబంధించి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు బీజేపీ బృందం ఫిర్యాదు చేయనుంది. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు ఫిర్యాదు చేసిన తర్వాత బీజేపీ అగ్రనేతలతో కూడా వారు భేటీ కానున్నారు. బండి సంజయ్ నేతృత్వంలోని 20 మంది కాషాయ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ ఛుగ్ నివాసంలో తొలుత నేతలంతా సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు కౌంటర్ ప్లాన్ ను బీజేపీ రచించనుంది. తమ పార్టీ కార్యకర్తలపై దాడులపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు.
