హైదరాబాద్‌: తనయుడు కేటీఆర్ కు సీఎం పదవిని అప్పగించే ఉద్దేశం కేసీఆర్ కు లేదంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం ఎంపీ సంతోష్ రావు పేరుచెప్పి తప్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేల పేరు చెప్పి కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించకుండా తప్పించుకుంటున్నారని అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు సంజయ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంకో 15 రోజుల్లో కేటీఆర్‌ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోందని... కానీ అలా జరగబోదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రచారం వెనుక చాలాపెద్ద ఎత్తుగడ వుందని సంజయ్ పేర్కొన్నారు.

read more  సొంత పార్టీ దిశగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: బండి సంజయ్ సంచలనం 

మంత్రి పదవి రాకపోతే తాము టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సొంతపార్టీ పెడతామని ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని... ఇలా వీరిచేత ప్రకటనలు చేయిస్తున్నది కేసీఆరేనని పేర్కొన్నారు. ఇలా ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెడితే ప్రభుత్వం పడిపోతుందని... కాబట్టి సీఎం అయ్యేందుకు కొద్దిరోజులు ఆగాలని కుమారుడికి కేసీఆర్‌ చెబుతారన్నారు. ఇందుకోసమే ఎమ్మెల్యేల చేత మాట్లాడిస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.