తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంజయ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. 

మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని బండి సంజయ్‌ బాంబు పేల్చారు. కరీంనగర్- వరంగల్‌ రహదారికి కేంద్రం నిధులు ఇచ్చిందని.. అయినప్పటికీ టెండర్లు పిలవకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ నేతలకే కాంట్రాక్టులు ఇస్తున్నారని.. కేసీఆర్ పేరు చెప్పి కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు సీఎంఓ ప్రజల కోసం పనిచేస్తోందా.. కమీషన్ల కోసం పనిచేస్తోందా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొన్నటి ఫలితాలే పునరావృతం అవుతాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.