ఒక్క రాష్ట్రంలో గెలిచినందుకే కాంగ్రెస్ రెచ్చిపోతోందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ . కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యర్ధి అని బండి సంజయ్ స్పష్టం చేశారు

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కాంగ్రెస్ నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందని ఆయన ఆరోపించారు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని రెచ్చగొట్టింది ఎవరు అని బండి ప్రశ్నించారు. పీఎఫ్ఐ మీద బ్యాన్ ఎత్తివేస్తామని చెప్పింది ఎవరని నిలదీశారు. బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కడా చెక్కుచెదరలేదని సంజయ్ స్పష్టం చేశారు. 

ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బజ్‌రంగ్‌ దళ్‌ను నిషేధిస్తామంటే దేశం మొత్తం ఒక్కటైందని బండి సంజయ్ తెలిపారు. ఒక వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్‌కు వచ్చాయన్నారు. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతైందని ఆయన చురకలంటించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యర్ధి అని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు. 

Also Read: కర్ణాటక ఫలితాలు.. జేడీఎస్, బీజేపీలకు పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ సత్తా.. కారణాలు ఇవేనా..?

ఇకపోతే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసిన ఆయన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించినందుకు ఆయన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. 

అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని బొమ్మై స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందనీ, దాని విజయానికి ప్రధాన కారణాలలో అది కూడా ఒకటి అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయనీ, ప్రజల ఆదేశాన్ని తాను చాలా గౌరవంగా స్వీకరిస్తున్నానని సీఎం తెలిపారు. బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తాననీ, మరెవరికీ బాధ్యత లేదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమికి వివిధ కారణాలు ఉన్నందున పూర్తి విశ్లేషణ చేస్తామని బొమ్మై అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పనితీరును కూలంకషంగా విశ్లేషిస్తామన్నారు ముఖ్యమంత్రి.