వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అసెంబ్లీలో వీఆర్ఏల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఆర్ఏల సమస్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో వీఆర్ఏల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో కేంద్రాన్ని తిట్టడం తప్ప చేసిందేమి లేదని సంజయ్ ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్‌తో జరిగిన చర్చ ఏందో కేసీఆర్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని సంజయ్ సవాల్ విసిరారు.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మర మనిషి అంటే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారా అని ఆయన అడిగారని... ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని ఆయన అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్టు అనలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ నడిపే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలే సస్పెండ్ చేస్తారని ఆయన జోస్యం చెప్పారు.
Also REad:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జీవితా రాజశేఖర్!.. బీజేపీ నుంచి హామీ వచ్చిందా..?
కాగా.. ఈ నెల 6వ తేదీన జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలకు సమాచారం అందలేదు. ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వీటిపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... ఈటల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
