Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జీవితా రాజశేఖర్!.. బీజేపీ నుంచి హామీ వచ్చిందా..?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం.. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ప్రధాన పార్టీలు ఆ మేరకు కార్యచరణ సిద్దం చేసుకుంటున్నాయి. 

jeevitha rajasekhar Likely to Contest Upcoming Telangana Assembly polls for BJP
Author
First Published Sep 13, 2022, 3:53 PM IST

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం.. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ప్రధాన పార్టీలు ఆ మేరకు కార్యచరణ సిద్దం చేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజాదరణ ఉన్న నాయకులను, సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించింది. అలాగే గెలుపు గుర్రాలనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తోంది. మరోవైపు ఇటీవల బీజేపీ అగ్ర నాయకులు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌లతో వేర్వేరుగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే ప్రముఖ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ తెలంగాణ అసెంబ్లీ బీజేపీ నుంచి బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్నారు. పలుపార్టీలు మారిన జీవిత రాజశేఖర్ దంపతులు.. కొంతకాలంగా ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. అయితే ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో కనిపించిన జీవిత.. తాము బీజేపీలోనే ఉన్నామనే సంకేతాలు పంపారు. తాము బీజేపీలోనే ఉన్నామని..  కానీ పార్టీనే తమను పట్టించుకోవటం లేదని బండి సంజయ్‌‌కి జీవిత చెప్పినట్టుగా తెలిసింది. 

ఇక, బండి సంజయ్ పాదయాత్రలో కనిపించిన సమయంలోనే.. జీవిత ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. వ్యక్తిగత కారణాలతో ఇంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. బీజేపీ నాయకత్వం కోరితే.. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. తెలంగాణలో మహిళలకు భద్రత లేదని విమర్శించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కావాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణ అనేక అంశాల్లో వెనుకబడి ఉందని జీవిత అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని చెప్పారు. ఏళ్ల తరబడి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. అది వృథా కాకూడదని అన్నారు. అలాగే బండి సంజయ్ నాయకత్వాన్ని ఆమె కొనియాడారు.

Also Read: కేసీఆర్ కుటుంబానికి ఉద్యమానికి ముందు ఆస్తులెన్ని?.. వాటిలో కేటీఆర్‌కు వాటా: జీవితా రాజశేఖర్ సంచలన కామెంట్స్

అలాగే బండి సంజయ్ ‌పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో కూడా జీవిత కనిపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్‌పై, సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే గతంలో పలు పార్టీలు(బీజేపీతో సహా) మారిన జీవితా రాజశేఖర్ పెద్దగా సాధించింది ఏమి లేదనే చెప్పాలి. 

ఈ క్రమంలోనే ఈసారి ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలని జీవితా రాజశేఖర్ దంపతులు భావిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న జీవిత.. ఇందుకు సంబంధించి ముందుగానే పార్టీ అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తనకు టికెట్ అంశం గురించి ఇదివరకే బండి సంజయ్‌ వద్ద ఆమె ప్రతిపాదన ఉంచారని సమాచారం. తనకు టికెట్‌ ఇచ్చే విషయంలో క్లారిటీ వచ్చాకే.. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్దమని జీవిత చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే జీహెచ్‌ఎంపీ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి జీవితను బరిలో నిలపాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వం నుంచి క్లారిటీ లభిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై జీవిత మరింతగా విమర్శలకు పదునుపెట్టే అవకాశం ఉందనే చర్చ టీ బీజేపీ వర్గాల్లో సాగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios