మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. డబ్బులిచ్చి నేతల్ని పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో చేరిక తేదీపై చర్చిస్తున్నారు. దాసోజు శ్రవణ్ బీజేపీలోకి రావడం ఘర్ వాపసీ అన్నారు తరుణ్ చుగ్. శ్రవణ్ విద్యార్ధి పరిషత్‌లో పనిచేశారని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. డబ్బులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. సోనియాను తిట్టినవాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రవణ్ బీజేపీలో ఎప్పుడు చేరతారనేది సాయంత్రం ప్రకటిస్తామని బండి సంజయ్ అన్నారు.
ALso REad:రేవంత్ సైన్యం దొంగల ముఠా.. పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారు: రాజగోపాల్ రెడ్డి
ఇకపోతే.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం చండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన నాయకురాలిని, భుజాన మోసిన కార్యకర్తలను నట్టేట ముంచి పక్క పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుణపాఠం చెప్పాలన్నారు. 2018 ఎన్నికల్లో టికెట్ దక్కనప్పటికీ పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ విజయం కోసం శ్రమించారని ఆయన గుర్తుచేశారు. వందల ఎకరాల భూములు కరిగిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పాల్వాయి గోవర్థన్ రెడ్డి విడిచిపెట్టలేదని రేవంత్ కొనియాడారు. ఆరు దశాబ్ధాల తెలంగాణ కలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన అన్నారు. మూసేసిన కేసులో సోనియాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోడీ.. ఈడీని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సోనియా గాంధీని ఈడీ అధికారులు హింసిస్తుంటే .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా పంచన చేరాడని రేవంత్ మండిపడ్డారు. సోనియా కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడని ఆయన మండిపడ్డారు. అసలు రాజగోపాల్ రెడ్డి మనిషేనా అంటూ ఫైరయ్యారు. ఇదే సమయంలో ఆయనపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
