తన ప్రజా సంగ్రామ పాదయాత్రకు భారీగా కదలి రావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా బీజేపీతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు

ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు భారీగా కదలి రావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా బీజేపీతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో అవినీతి, కుటుంబపాలనను అంతమొందిద్దామని.. ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని బండి సంజయ్ చెప్పారు. సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్ర చేయాలని బీజేపీ చీఫ్ నిర్ణయం తీసుకొన్నాడు.ఈ నెల మొదటి వారంలోనే పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పాదయాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

Also Read:ఆగష్టు 24 నుండి ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు

విడతల వారీగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు బండి సంజయ్. మొదటి విడతగా ఈ నెల 24వ తేదీ నుండి యాత్ర ప్రారంభం కానుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తొలివిడత పాదయాత్ర ఈ రూట్‌ గుండా సాగనుంది. మొదటి విడత యాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరో విడత యాత్రను బండి సంజయ్ నిర్వహించనున్నారు.