దుబ్బాక ఉపఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ .

దుబ్బాక విజయం అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఓటర్లు చైతన్యపరులని ఇకపై బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read:దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే

కేసీఆర్ నిరంకుశ పాలనకు తెరదించుతామని సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ విజయాన్ని తెలంగాణ అమర వీరులకు కూడా అంకితం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.

దీంతో ఫలితాలు చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపాయి. చివరికి 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. మరోవైపు దుబ్బాక విజయంతో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు.

బాణాసంచా కాల్చి, డోలు, బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. కార్యకర్తలు ఆనందంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను తమ భుజాలపైకి ఎత్తుకున్నారు.

అనంతరం గన్ పార్క్ వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పార్టీకి ఇది తొలి విజయం కావడం విశేషం.

ఇక గంగుల శ్రీనివాస్ (23) అనే కార్యకర్త నవంబర్ 1న నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటికున్నాడు. కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత మృతి చెందాడు.