Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇవే.. నీ ముక్కు నేలకు రాస్తావా: కేసీఆర్‌కు సంజయ్ సవాల్

హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

telangana bjp chief bandi sanjay challenges to cm kcr ksp
Author
Hyderabad, First Published Nov 24, 2020, 9:52 PM IST

హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

భాగ్యనగర అభివృద్ధికి కేంద్రం గత ఐదేళ్లలో రూ. వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇండ్ల పైసలు, రోడ్ల పైసలు, మహిళా సంఘాలకిచ్చే రుణాలు, బాత్రూంలు, స్మశాన వాటికల నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివేనని సంజయ్ చెప్పారు.

కేసీఆర్... ఇవిగో నా దగ్గర లెక్కలున్నాయి... ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించిన లెక్కలే ఇవి అంటూ ఆయన స్పష్టం చేశారు. తన లెక్కలు తప్పయితే తనపై కేసులు పెట్టి జైలుకు పంపాలని సంజయ్ తేల్చి చెప్పారు. ఒకవేళ నిజమని తేలితే హైదరాబాద్ నడిబొడ్డున నీ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెబుతావా?’’ అని ఆయన సవాల్ విసిరారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ, చిలుకానగర్, ఉప్పల్, గడ బీజేపీ అభ్యర్థులు హరీ ప్రాంతాల్లో జరిగిన సభల్లో బండి సంజయ్ ప్రసంగిస్తూ ఉద్వేగ భరితంగా మాట్లాడారు.

రూ.10 వేలు ఇస్తానని మోసం చేసిన కారు కావాలా? రూ.25 వేలు ఇచ్చే కమలం కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఈ విషయంలో మీరిచ్చే నినాదాలు, కోపంతో మీరు పటపట కొరికే పళ్ల (దంతాలు) సౌండుకు కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ చెవుల్లోంచి రక్తం కారాలంటూ వ్యాఖ్యానించారు.

ఏనాడూ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయని కేసీఆర్ ఈ సారి బీజేపీకి, భాగ్యనగర్ ప్రజలకు భయపడి ఫాంహౌస్ నుండి బయటకొచ్చి మొట్ట మొదటి సారిగా మేనిఫెస్టో విడుదల చేశారని సంజయ్ ఆరోపించారు. 

Also Read:పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

ఆర్టీఐ కింద కేంద్ర ఆర్దిక సంఘం గత ఐదేళ్లలో రూ.12,087 కోట్లు ఇచ్చింది. కానీ రాష్ట్ర ఆర్దిక సంఘం ఇచ్చిన నిధులు రూ.78 కోట్లు మాత్రమేనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2,03,87 ఇండ్ల నిర్మాణానికి రూ.2,280 కోట్లను నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

ఒక్క జీహెచ్ఎంసీలోనే లక్షన్నర ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని.. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సంజయ్ ఆరోపించారు. నిలువ నీడ లేని పేదల కోసం ఒక్కో ఇంటి కోసం రూ.1.5 లక్షలు కేంద్రం మంజూరు చేస్తే అవి పేదలకు అందకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. 

పేదలకు ఉచిత బియ్యం కోసం కిలోకు రూ.29 ల 85 పైసల చొప్పున నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది నిజం కాదా? ఆ డబ్బుతో తన ఫొటో పెట్టకుని రూపాయికే కిలో బియ్యం నేనే ఇస్తున్నానని కేసీఆర్ చెప్పుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios