తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రశస్త్రాలను  సిద్ధం చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఆదేశించింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఒకట్రెండు రోజుల పాటు బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తరపున సంజయ్ ప్రచారం నిర్వహించే అవకాశం వుంది.

ఏప్రిల్ 14న జరిగే ర్యాలీలో బండి సంజయ్ పాల్గొనే అవకాశం వుంది. మరోవైపు అంతకుముందే తిరుపతి ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఏపీ బీజేపీ నేతలు బండి సంజయ్‌ని ఆహ్వానించారు.

గతంలోనే భగవద్గీత పార్టీ కావాలో, బైబిల్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిందిగా బండి సంజయ్ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

బైబిల్ చేత పట్టుకుని వచ్చే పార్టీ కావాలో.. భగవద్గీత చేతిలో పట్టుకుని వచ్చే పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతం కాబోతున్నాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఆయన ఖండించారు. విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు అప్పట్లోనే వైసీపీ నేతలు గట్టి కౌంటరిచ్చారు.