ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం (PM Modi security lapse) తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ (Telangana BJP).. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం (PM Modi security lapse) తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భద్రతా లోపం కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై బుధవారం 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైతులు రోడ్డుపై నిరసన తెలుపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకన్న కేంద్ర హోం శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కూడా కోరింది. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇందుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రతకు సంబంధించి పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పంజాబ్ ప్రభుత్వమే ప్రధాని రూట్‌కు సంబంధించిన వివరాలను నిరసనకారులకు లీక్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ.. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మండల, జిల్లాల స్థాయి పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్.. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అల్కపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.
