Hyderabad: అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బీజేపీ అనూహ్య ట్విస్ట్.. పార్టీ సభ్యత్వం లేకున్నా.. !
బీజేపీ హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాధవీ లతను బీజేపీ బరిలోకి దించుతున్నది. ముందుగా ఆమెను తమ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఒక రోజు తర్వాత పార్టీలో చేర్చుకుంది.
తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు గెలుచుకోకున్నా.. ఓటు షేరింగ్ మాత్రం గణనీయంగా పెంచుకుంది. ఇది ఈ లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని ఆ పార్టీ ఆశాభావంగా ఉన్నది. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసే హైదరాబాద్‌లో బలమైన పోటీ ఇస్తామని పలుమార్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని తెలంగాణ బీజేపీ ప్రకటించింది. అయితే.. ఇందులో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉన్నది.
విరించి హాస్పిటల్ చైర్మన్ కొంపెల్లా మాధవీలతను బీజేపీ హైదరాబాద్ నుంచి బరిలోకి దించుతున్నది. అయితే.. ఈమెకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేకున్నా.. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. శనివారం ఆమెను హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరుసటి రోజైన ఆదివారం ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. అంటే.. ఆమె ప్రాథమిక సభ్యత్వం కంటే కూడా టికెట్ ముందు లభించింది.
Also Read : Prashant Kishor : బీఆర్ఎస్‌కు గడ్డుకాలమేనా ? అలాగైతే ప్రమాదంలో పడినట్టే: ప్రశాంత్ కిశోర్
శనివారం మాధవీలత ను హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా.. తరుణ్ ఛుగ్ సమక్షంలో ఆదివారం ఆమె బీజేపీలో చేరారు.
మాధవీ లత బిజినెస్‌వుమన్, భరతనాట్యం డ్యాన్సర్, ఎన్‌సీసీ క్యాడెట్. కనీసం గత ఆరు నెలలుగా పాత బస్తీపై ఆమె ఫోకస్ పెట్టారు. అక్కడ త్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆమె ఎప్పుడూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. త్రిపుల్ తలాఖ్‌ను పూర్తిగా నిర్మూలించడానికి ఆమె ముస్లిం మహిళల గ్రూపులతో కలిసి పని చేస్తున్నారు. నిరుపేదలైన ముస్లిం మహిళల సంక్షేమం కోసం ఆమె ఓ నిధిని ఏర్పాటు చేశారు. హిందూత్వను ప్రచారం చేయాలని బలమైన కాంక్ష కలిగిన వ్యక్తి మాధవీ లత. ఆమె ఓ గోశాలను కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం తెలిసింది..