తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బాన్సువాడలో ఈసారి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి బరిలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం స్పందించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. గతంలో మాదిరిగా వార్ వన్ సైడ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ దూసుకొస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విబేధాలు వున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో కేడర్ బలంగా వుంది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు వున్నాయంటూ ప్రచారం జరుగుతూ వుండటంతో దీనికి తగ్గట్లుగానే అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. అయితే అన్ని పార్టీల్లోనూ ఆశావహుల జాబితా భారీగా వుంది.
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తండ్రి స్పీకర్ హోదాలో వుండటంతో నియోజకవర్గంలోని పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలను డీసీసీబీ ఛైర్మన్‌గా వున్న భాస్కర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అధికారులను ఆయనే నడిపిస్తున్నారు. ఈ కారణంగానే భాస్కర్ రెడ్డి అభ్యర్ధిత్వం చర్చకు వచ్చింది. పోచారం వయసు పైబడుతుండటంతో కొడుకును బరిలోకి దింపుతాని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రచారానికి తెరదించారు స్పీకర్ పోచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి తానే బరిలో వుంటానని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని.. దానిని నిలబెట్టుకుందామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతలు, అభిమానుల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని పోచారం వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా అది ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందని.. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని స్పీకర్ సూచించారు.
