Asianet News TeluguAsianet News Telugu

నిర్మలా సీతారామన్ నాకు అక్కవంటివారు.. కానీ, అన్ని అబద్ధాలే చెప్పారు: కేంద్రమంత్రి పర్యటనపై పోచారం కౌంటర్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బాన్సువాడ, బీర్కూర్ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఒక్కో విషయాన్ని ఆయన వివరిస్తూ కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఎండగట్టారు.
 

telangana speaker pocharam srinivasa reddy counters union finance minister nirmala sitaraman as latter touring bansuwada
Author
First Published Sep 2, 2022, 8:08 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటనకు కౌంటర్ ఇచ్చారు. సీతారామన్ చేసిన ప్రకటనలు అబద్ధాలను, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా పథకాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టం చేశారు. 

తాను ఈ రోజు స్పీకర్‌గా కాకుండా బాన్సువాడ ఎమ్మెల్యేగా, మాజీ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా మాట్లాడుతున్నట్టుగా తొలుతే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనకు అక్కవంటివారని, కానీ, ఆమె తన పర్యటనలో అబద్ధాలే చెప్పారని కౌంటర్ ఇచ్చారు. ఆమెతో తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా విభేదాల్లేవని, ఒకరిని ఇంకొకరు విమర్శంచడానికి బదులు కలిసి అభివృద్ధి చేసి దేశంలోని 80 శాతం పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని సూచనలు చేశారు.

తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ప్రత్యేక నిధులు, పథకాలు ప్రకటిస్తారని ఆశపడ్డారని, కానీ, ఆమె నిరాశపరిచిందని అన్నారు. గతంలో తాము కోరిన విజ్ఞప్తులపైనా కనీసం స్పందించలేదని పేర్కొన్నారు.

గతంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి కోల్డ్ స్టోరేజీల కోసం విజ్ఞప్తి చేశామని, ఒక్కటి కూడా మంజూరు చేయలేదని అన్నారు. 25 శాతం లబ్దిదారులు, 75 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకం తాను పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మొదలైందని అన్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి ఎన్‌సీడీసీ నుంచి రుణం తీసుకున్నామని, ఎన్‌సీడీసీకి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ, ఈ రుణం కేంద్రం ఇచ్చిందని సీతారామన్ అబద్ధం చెప్పారని అన్నారు. చేపట పంపిణీ కార్యక్రమానికి కూడా నిధులు ఇస్తున్నామని అవాస్తవంగా మాట్లాడారని తెలిపారు. 

ఆమె అసత్యాల్లో భాగంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు, ప్రాజెక్టులతో సాగు నీరు అందించడం, పంటను కొనుగోలు చేయడం మూలంగా రైతుల జేబుల్లో కొన్ని డబ్బులు మిగులుతున్నాయని, రైతు ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. దేశంలో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదేనని, నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని, కనీసం జాతీయ హోదా అయినా ప్రకటించలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ పథకం కేంద్రానిదని ఆమె ప్రగల్భాలు పలికారని, అలాగైతే, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎందుకు ఈ పథకం అమలు కావడం లేదని ప్రశ్నించారు. రేషన్ బియ్యంలోనూ సగం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని తెలిపారు. 

ఒకరిపై బురదజల్లడం కాదు.. హుందాగా వ్యవహరించాలని, ప్రజలకు సేవ చేయడానికి పోటీ పడాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశమంతటా అమలు చేయాలని సూచించారు. సీతారామన్‌ను తమ ఆడబిడ్డగా భావించి పర్యటనలో అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు చేశామని, తమ నియోజక పర్యటనకు విచ్చేసిన కేంద్రమంత్రికి స్వాగతం అని అన్నారు. కేంద్ర మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌కు నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి, తమ నియోజకవర్గానికి ప్ర్తత్యేక నిధులు కేటాయిస్తారని, ప్రజలు, తాను ఆశిస్తున్నామని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios