తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక, తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆర్టీసీ విలీనం డ్రాప్ట్ బిల్లుకు ఈరోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలుపడంతో మూడు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బిల్లు సభలో టేబుల్‌పైకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సాగుతుంది. ఈ చర్చ అనంతరం ప్రభుత్వం ఆర్టీసీ విలీన బిల్లును సభలో టేబుల్ చేయనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి సభలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం (ఆగస్టు 3)న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పీడిస్తున్న వివిధ సమస్యలపై చర్చించేందుకు కనీసం 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే బీఏసీ సమావేశం అనంతరం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఒక రోజు(ఆదివారం) అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. తాజాగా ఆర్టీసీ బిల్లు, ఇతర అంశాల దృష్ట్యా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.