హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గం కూర్పు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తాము ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతామా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 

ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది చెప్పకుండానే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ ను మాత్రం ప్రకటించేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రోటెం స్పీకర్ గా కేసీఆర్ ఎంపిక చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్. ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇప్పటి వరకు ఆరు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు అవకాశం కల్పించడంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.    

యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన ఆరుసార్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సార్లు ఆయన విజయకేతనం ఎగురవేశారు.