ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగైదు రోజులపాటే ఈ సమావేశాలు జరుగుతాయని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వ, ప్రతిపక్షాలు బలమైన చర్చ చేసే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారానికి మించి జరిగే అవకాశాలు లేవని తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు మూడు, నాలుగు నెల్లలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రభుత్వ హయాంలో ఇవి చివరి అసెంబ్లీ సమావేశాలు. ఎన్నికలకు ముందటి సమావేశాలు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధం అయ్యాయి.
ఈ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే అంశానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, మరికొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించి బిల్లుల ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం.. తమ హయాంలో ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సూత్రప్రాయంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
కాగా, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే యోచనలో ఉన్నాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాలని ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వరదల గురించి, వరద నష్టం, పంట నష్ట పరిహారం, వరద బాధితులకు పరిహారం వంటి అంశాలపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: అన్నదాతలకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ, అధికారులకు కీలక ఆదేశాలు
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని, ఈ సమావేశాల ద్వారా కొన్ని వర్గాలను తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టి వారిలోని ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించే ప్రయత్నం చేయనుంది. అలాగే, రైతులకు రుణమాఫీ ప్రకటించి కాంగ్రెస్ బలమైన డిమాండ్‌ను అసెంబ్లీ ఎన్నికలకు ముందే నీరుగార్చింది.
