తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై రసమయి బాలకిషన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడుగుతున్నానని, అసలు విషయంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు‌, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య సంవాదం కొనసాగింది. డిప్యూటీ స్పీకర్‌పై రసమయి అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడే అవకాశం రాదు.. ప్రశ్నలు అడగనివ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే.. ప్రశ్నోత్తరాల సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతున్న సందర్భంలో.. కేవలం ప్రశ్నలే అడగాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు చెప్పారు. ప్రశ్నలు అడగండి.. ప్రసంగాలు వద్దని సూచించారు. పది మందికి మాట్లాడే అవకాశం రావాలని తెలిపారు. ఈ క్రమంలోనే రసమయి మైక్ కట్ చేశారు.

అయితే తర్వాత మళ్లీ రసమయికి మట్లాడే అవకాశం ఇచ్చారు. అసలు విషయానికి వచ్చినప్పుడు మైక్ కట్ చేస్తే ఎలా అని రసమయి ప్రశ్నించారు. తమకెందుకు ప్రశ్నలు ఇవ్వడం అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలా అయితే తమకు ప్రశ్నలు ఇవ్వొద్దని అన్నారు. ప్రశ్నలు అడిగే అవకాశం ఒక్కరికే ఇవ్వండి అని అన్నారు. ఈ క్రమంలోనే కూర్చుంటామని చెప్పి సీట్లో కూర్చొన్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ కన్‌క్లూడ్ చేయాలని చెప్పడంతో.. రసమయి మాట్లాడారు. 

ఇక, ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై సభలో చర్చ జరుగనుంది. ఈ రోజు సభలో రెండు బిల్స్‌తో పాటు 6 పద్దులపై చర్చ చేపట్టనున్నారు. సాంకేతిక విద్య, పర్యాటకం, మెడికల్ అండ్ హెల్త్, లేబర్ ఎంప్లాయిమెంట్, అడవుల అభివృద్ధి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ పై సభలో చర్చ జరుగనుంది.