తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్... చివరకు హోంమంత్రినీ పోలీసులు వదిలిపెట్టడం లేదుగా...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చివరకు హోంమంత్రి అయినాసరే పోలీసుల తనిఖీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పహారా కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బులు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఇలా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాల తనికీ చేపట్టారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల వాహనాలనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు... చివరకు హోంమంత్రి కారును కూడా వదిలిపెట్టడం లేదు పోలీసులు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో మైనారిటీ ఓట్లు కూడా అధికంగా వుండటంతో బిఆర్ఎస్ మహమూద్ అలీతో ప్రచారం చేయిస్తోంది. ఇలా కామారెడ్డి ప్రచారం కోసం వెళుతున్న హోమంత్రి మహమూద్ అలీ కారును పోలీసులు అడ్డుకున్నారు.
కామారెడ్డిలో మైనారిటీ మీటింగ్ కు హోంమంత్రి వెళుతుండగా మార్గమధ్యలోని చెక్ పోస్ట్ వద్ద తనిఖీ కోసం కారును ఆపారు పోలీసులు. వెంటనే కారుదిగిన మహమూద్ అలీ పోలీసుల తనికీకి సహకరించారు. కారు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఏమీ లేకపోవడంతో పంపించేసారు. ఈ తనిఖీ సమయంలో హోంమంత్రితో పాటు జహిరాబాద్ ఎంపీ బిబి పాటిల్ కూడా కారులో వున్నారు.