Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మీద పోరు: ప్రజా కూటమి లెక్కలు ఇవీ...

తెలంగాణలో 2.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 60 నుంచి 70 శాతం ఓట్లు పోలవుతాయని అనుకుంటే, ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల నుంచి 1.40 లక్షల మధ్య ఓట్లు పోలవుతాయి. ముఖాముఖి పోటీ ఉన్న చోట్ల విజయం సాధించడానికి ఒక్కో అభ్యర్థికి 60 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంటుంది. 

Telangana Assembly elections: Praja Kutami is confident of...
Author
Hyderabad, First Published Nov 14, 2018, 2:54 PM IST

హైదరాబాద్: ప్రజా కూటమి నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ధీటుగా ఎదుర్కోగలమనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెసు తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితిలతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టడానికి తగిన కారణాలున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు కూటమి నేతలకు ఉన్నాయి. 

కూటమి కట్టడం ద్వారా కనీసం 40 శానససభ నియోజకవర్గాలను గెలుచుకోగలమనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, నిజామాబాద్ జిల్లాలో ఆ 40 సీట్లను కూటమి నేతలు కీలంగా భావిస్తున్నారు. 

తెలంగాణ శాసనసభలో మొత్తం 119 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 65.67 లక్షల ఓట్లను సాధించి టీఆర్ఎస్ 63 స్థానాలను గెలుచుకుంది. విడివిడిగా పోటీ చేయడంతో తెలుగుదేశం, కాంగ్రెసు మధ్య ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ విజయానికి దోహదపడినట్లు భావిస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు 47 లక్షల ఓట్లు సాధించిన కాంగ్రెసు 21 స్థానాలను, 43 లక్షల ఓట్లను సాధించిన టీడీపి 15 స్థానాలను, టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి 5 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతర పార్టీలకు 3 లక్షల ఓట్ల దాకా పోలయ్యాయి. 

తెలంగాణలో 2.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 60 నుంచి 70 శాతం ఓట్లు పోలవుతాయని అనుకుంటే, ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల నుంచి 1.40 లక్షల మధ్య ఓట్లు పోలవుతాయి. ముఖాముఖి పోటీ ఉన్న చోట్ల విజయం సాధించడానికి ఒక్కో అభ్యర్థికి 60 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంటుంది. 

ఫిరాయింపుల వల్ల, ఇతర కారణాల వల్ల టీడీపి ఓటు బ్యాంకు తగ్గిందని భావించినా కనీసం పది లక్షల ఓటు బ్యాంకైనా మిగిలి ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. అంటే, ఒక్కో నియోజకవర్గంలో పది వేల ఓట్లయినా టీడీపికి ఉంటాయని అంచనా వేస్తున్నారు 

ముఖ్యమంత్రిగా కేసిఆర్ అగ్ర స్థానంలో ఉన్నారు. ప్రజల దృష్టిలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలనే అభిప్రాయమే బలంగా ఉందనేది కాదనలేని విషయం. అలాగే ప్రజాసంక్షేమ పథకాలు కూడా టీఆర్ఎస్ కు తోడవుతాయి. అంతే కాకుండా, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఆ రకంగా టీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. 

అయితే, కాంగ్రెసు, టీడీపీ మధ్య ఓట్ల బదిలీ సరిగా జరిగితే, పోల్ మేనేజ్ మెంట్ సరిగా ఉంటే టీఆర్ఎస్ ను ఓడించడం కష్టం కాదనే అంచనాలో ప్రజా కూటమి నాయకులు ఉన్నారు. దానికితోడు, పలువురు టీఆర్ఎస్ సిట్టింగులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని ఖాతరు చేయకుండా కేసిఆర్ వారికే టికెట్లు ఇచ్చారు. తనకున్న ఇమేజ్ వల్ల, తన ప్రభుత్వ పథకాల వల్ల తమ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు.

అయితే,  గతంలో ఉద్యమ విజేతగా టీఆర్ఎస్ వైపు గాలి వీచింది. దీంతో టీఆర్ఎస్ ఎవరిని నిలిపినా విజయం సాధ్యమైంది. కానీ ఆ గాలి ఇప్పుడు ఉండదు. టీఆర్ఎస్ గాలి వీయడం వల్ల కాంగ్రెసుకు ఉత్తర తెలంగాణలో కేవలం ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు టీడీపి, కాంగ్రెసు, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేస్తుండడం వల్ల టీఆర్ఎస్ గత ఎన్నికల్లో మాదిరిగా గంపగుత్తగా గెలిచే అవకాశం ఉండదని అంటున్నారు. 

అయితే, బిజెపి ఒంటరిగా పోటీ చేస్తోంది. సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ అభ్యర్థులు కూడా రంగంలో ఉంటారు. ఈ రెండు శక్తులు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే ప్రజా కూటమి విజయావకాశాలపై వేటు పడే అవకాశమే ఉంటుంది. మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉంటుందనేది మాత్రం నిజం.

Follow Us:
Download App:
  • android
  • ios