Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చ


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఇవాళ భేటీ అయ్యారు.  సీట్ల సర్ధుబాటుపై  చర్చిస్తున్నారు. 

Telangana Assembly Elections  2023:TJS Chief Kodandaram Meets Congress Leader Rahul Gandhi in Karimnagar lns
Author
First Published Oct 20, 2023, 9:43 AM IST | Last Updated Oct 20, 2023, 3:47 PM IST

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి (టీజేఎస్) చీఫ్ కోదండరామ్ శుక్రవారం నాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు అంశంపై  చర్చించనున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి  వెళ్లాలని టీజేఎస్ భావిస్తుంది. అయితే  సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  సాచివేత ధోరణి అవలంభిస్తుందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అసంతృప్తితో ఉన్నారు.  ఈ నెల  16వ తేదీన  కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో చర్చించారు.  పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయిస్తారనే విషయమై కాంగ్రెస్ నాయకత్వం నుండి స్పష్టత రాకపోవడంతో  కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

24 గంటల్లో సీట్ల సర్ధుబాటుపై తేల్చాలని ఈ నెల  16న కాంగ్రెస్ నేత మల్లు రవికి తేల్చి చెప్పారు. అయితే  తెలంగాణలో  బస్సు యాత్రలో పాల్గొనేందుకు  రాహుల్ గాంధీ ఈ నెల  18న  రాష్ట్రానికి వచ్చారు. దీంతో  పొత్తుల విషయమై  చర్చలకు  రావాలని కాంగ్రెస్ నాయకత్వం కోదండరామ్ ను కోరింది. కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానం మేరకు  టీజేఎస్ చీఫ్ కోదండరామ్  కరీంనగర్  చేరుకున్నారు.  కరీంనగర్ లో రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ లో ఆయనతో భేటీ అయ్యారు. సీట్ల సర్ధుబాటు విషయమై చర్చలు జరుపుతున్నారు.ఈ చర్చల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ కూడ పాల్గొన్నారు.

తెలంగాణలో  తమకు  12 సీట్లు ఇవ్వాలని  టీజేఎస్ ప్రతిపాదించింది. అయితే ఇందులో కనీసం ఆరు సీట్లు ఇవ్వాలని కోదండరామ్ పార్టీ కోరుతుంది.జహీరాబాద్,  సూర్యాపేట, ఎల్లారెడ్డి, ముథోల్, కోరుట్ల,నర్సంపేట స్థానాలపై  టీజేఎస్ పట్టుబడుతుంది.  తాము కోరుతున్న  సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంపై  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ పార్టీతో పొత్తు అంటూనే  తాము కోరుతున్న  సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంపై  కోదండరామ్  కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.   టీజేఎస్,  లెఫ్ట్ పార్టీలతో మైత్రిని కాంగ్రెస్ కోరుకుంటుంది. 

also read:టీజేఎస్‌తో కాంగ్రెస్ పొత్తు చర్చలు: అభ్యర్థుల ప్రకటనపై కోదండరామ్ అసంతృప్తి

సీపీఐ, సీపీఎంలకు  రెండేసి అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే ఏ అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. సీపీఐకి  చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను  కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. చెన్నూరుకు బదులుగా  మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని  పొత్తులో తీసుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీపీఐ నేతలు కోరుతున్నారు.

సీపీఎంకు మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. కానీ  మరో అసెంబ్లీ సీటు కేటాయింపుపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  ఇబ్రహీంపట్నం, పాలేరు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి  కేటాయించాలని కాంగ్రెస్  ను సీపీఎం కోరుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios