తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని నిర్ణయించుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందరూ కేవలం ఆయన కామారెడ్డికే పరిమితం అవుతారని భావించారు.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తానని సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిన్న మధ్యాహ్నం మీడియా సమక్షంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేయబోయే 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అందులో తాను సొంతంగా గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని కొన్ని నెలల నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ గజ్వేల్ ను వదిలిపెట్టి కేవలం కామారెడ్డికి పరిమితం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇలా రెండు స్థానాల్లోనూ ఆయన పోటీ చేస్తారని పరిశీలకు కూడా ఊహించలేదు. తాజా నిర్ణయం వల్ల ఎన్టీ రామారావు తర్వాత రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గా రికార్డు నెలకొల్పనున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా 1989లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేశారు. కానీ కల్వకుర్తిలో ఓడిపోయారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక హోదాలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, పాలకొల్లు పోటీ చేశారు. ఆయన పాలకొల్లులో ఓడిపోయారు.

అయితే కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన సీటు తీసుకోవాలని కోరడంతో రెండు స్థానాల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కొందరు నిజామాబాద్ కు చెందిన నేతలు కూడా సీఎంను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కోరారని కేసీఆర్ తెలిపారు. అయితే ఈ రెండు స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ను నిలుపుకోవాలో, దేన్ని వదులుకోవాలో తర్వాత నిర్ణయిస్తానని చెప్పారు. తాను గతంలో కరీంనగర్ లోక్ సభ, మహబూబ్ నగర్ లోక్ సభ వంటి వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేశానని, ఇది అసాధారణమేమీ కాదని ఆయన గుర్తు చేశారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేశారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014లో తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాగా.. నల్లగొండ, కరీంనగర్ నుంచి విజ్ఞప్తులు రావడంతో గత ఏడాది కాలంగా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపాయి. 2009-2014 మధ్య మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించినందున దక్షిణ తెలంగాణ నుంచి, ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి ఒక సీటును పరిగణనలోకి తీసుకోవాలని కొందరు సూచించారు. కానీ ఆయన కామారెడ్డి వైపే మొగ్గు చూపారు.