Telangana: సీఎం పదవి పై సీతక్క ఆసక్తికర కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే..?
Telangana: ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ములుగు ఎమ్మెల్యే సీతక్క (Sitakka) సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ ఏ వ్యాఖ్యలు చేశారంటే..?
Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో రాజకీయ నేతల ప్రసంగాలు, ప్రెస్ మీట్స్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించాలని అభ్యర్థులందరూ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. హామీలను కురిపిస్తున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క (Sitakka) సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ (BRS) గెలిస్తే కేసీఆర్ కుటుంబసభ్యులే సీఎం అవుతారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తే.. ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓ ఓసీ అభ్యర్థి సీఎం కావొచ్చని, ఓ వేళ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే.. తాను సీఎం పదవి చేపడుతానని ఎమ్మెల్యే సీతక్క(Sitakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని, తాను 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన బలం, బలహీనత మొత్తం పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలేననీ, రెండు వందల కోట్లు ఖర్చు పెట్టయిన తనని ఓడించలేరని, ప్రతిపక్షాలు తనని ఓడించాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వచ్చినపుడు.. వరదలు వచ్చినపుడు.. ఇళ్లు కాలిపోయినపుడు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాలేని , ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు ములుగులో తిష్ట వేశారని అన్నారు. ఇవాళ ఓట్ల కోసం రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడానికి కూడా వెనకడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ప్రజలకు సేవ చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాననీ, తన కోసం రాజకీయాల్లోకి రాలేదని మరోసారి నొక్కి చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్నప్పటికీ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారనీ, ప్రజలకు కూడా ఇక్కడి రాజకీయాలు అర్థమవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, పేదలకు ఇళ్లు కట్టించింది, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. చదువుకున్న విద్యార్థులంతా నిరుద్యోగులుగా ఉన్నారని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు చూసి తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోతున్నాయని, నిరుద్యోగ యువత మొత్తం తమ వైపే ఉందనీ, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.