Telangana Assembly Elections 2023: ఎన్నికల వేళ కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు !
Hyderabad: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు కనిపించే అన్ని చిత్రాలు తెలంగాణలో ఇప్పుడే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కాస్త జోరుగా ముందుకు సాగుతుండగా, బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు, క్షేత్రస్థాయి క్యాడర్ బయటకు వస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, బీజేపీకి మరో గట్టి షాక్ తగిలేల పరిస్థితులు మారుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు కనిపించే అన్ని చిత్రాలు తెలంగాణలో ఇప్పుడే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కాస్త జోరుగా ముందుకు సాగుతుండగా, బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు, క్షేత్రస్థాయి క్యాడర్ బయటకు వస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, బీజేపీకి మరో గట్టి షాక్ తగిలేల పరిస్థితులు మారుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పలువురు బీజేపీ నేతలు పరోక్షంగా సంబంధిత వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూరుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు తెలంగాణలో బీజేపీలో పూర్తిగా గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఓడించడానికి కాంగ్రెస్ లో చేరడంతో సహా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని పరోక్షంగా సీనియర్ నాయకుల బృందం ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదే సమయంలో నాయకత్వ లేమి, కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం పూర్తిగా లేకపోవడంపై విసిగిపోయామనీ, గత కొంత కాలంగా తమ మధ్యే మాట్లాడుకుంటున్నామని, కేసీఆర్ ను ఓడించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు డీసీ నివేదించింది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న దయనీయ స్థితి, పార్టీ తీరుతెన్నులపై చర్చిస్తున్న నేతల్లో కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే తామంతా బీజేపీలో చేరామని మరో నేత చెప్పారు. అయితే, ప్రస్తుతం సీఎంను ఓడించే స్థితిలో బీజేపీ లేదని పలువురు నాయకులు మాట్లాడుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
ఈ బృందంలో మాజీ ఎంపీలు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. వీరిలో పాటు మరో 25 మంది బీజేపీ నేతలు సైతం ఈ అంశాలపై చర్చిస్తున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. అయితే, ఈ తరహా చర్యలు ముందుకు సాగడం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. దీనికి తోడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీని దెబ్బతీసింది. కేసీఆర్ ను ఓడించడానికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న బీజేపీలో ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నాలు చేయగా, సొంతపార్టీ నేతలే అడ్డుపడుతున్నారనీ, దీంతో పార్టీలో తమ భవితవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఓ నేత చెప్పారు. పార్టీ శ్రేణుల్లో చాలా అసంతృప్తి ఉందని అంగీకరించిన పార్టీ నేత ఒకరు, అసంతృప్తితో ఉన్నవారు తాము ఏమి కోరుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పగలిగితే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అయితే, బీజేపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.