KCR: అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంచార్జీలు.. ఎన్నికల అభ్యర్థులపై నిఘా.. !
Hyderabad: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఇంచార్జీ వ్యవస్థను ఉపయోగించుకుని మంచి ఫలితాలు రాబట్టిన నేపథ్యంలో.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇంచార్జీలను నియమించేందుకు నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై ఓ కన్నేసి ఉంచేందుకు, వారి గ్రౌండ్ వర్క్ ను ట్రాక్ చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించడంతో పాటు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరును ట్రాక్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియోజకవర్గాల్లో ఈ పనిని చేపట్టనున్నారు. రోజువారీ రిపోర్టులు ఇవ్వడం, నియోజకవర్గంలో అభ్యర్థి ఎలా కదులుతున్నారు, ప్రజలందరినీ కలుస్తున్నారా, ఆయన ఖర్చులపై ఓ కన్నేసి ఉంచడం వంటి పలు బాధ్యతలు వీరిపై ఉంటాయని తెలిసింది. ఇంచార్జీలు తమ నివేదికలను సీనియర్ నేతలకు ఇవ్వనున్నారు, వారు తరువాత బీఆర్ఎస్ చీప్ కేసీఆర్ కు వివరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఇంచార్జ్ వ్యవస్థను ఉపయోగించుకుంది. మునుగోడు ఉపఎన్నికలో ప్రతి గ్రామానికి ఇంచార్జీలను నియమించింది. జనాన్ని సమీకరించి వారిని ఓటు వేసేలా ఒప్పించడంలో ఇంచార్జీలు కీలక పాత్ర పోషించారు. అభ్యర్థులను తమ గుప్పిట్లో పెట్టుకోవడం, ప్రచారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదనేది దీని వెనుక ఉన్న ఆలోచనగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో అధికార వ్యతిరేకత ఉంటే ఇంచార్జీలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావచ్చనీ, వారు సమస్యలను పరిష్కరిస్తారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఎన్నికల్లో మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. మంత్రులు తమ నియోజకవర్గంతో పాటు పార్టీ ఎక్కువగా దృష్టి సారించాల్సిన నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
తమకు కేటాయించిన నియోజకవర్గంలో ప్రచారానికి కొంత సమయం కేటాయించి ఓటర్లతో సమావేశాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. గతంలో మండలి ఎన్నికల్లో పార్టీ మంత్రులను ఇంచార్జీలుగా నియమించింది. ఈ నెలాఖరులోగా పార్టీ ఇంచార్జీలను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంచార్జీలు నాయకత్వానికి సంబంధించిన అప్డేట్స్ అభ్యర్థులకు కూడా ఇస్తారు. కొంతమంది అభ్యర్థుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే వారికి పార్టీ బీ-ఫారం ఇవ్వకపోవచ్చని బీఆర్ఎస్ చీఫ్ సూచించడంతో ఇంచార్జీల పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలనీ, ప్రచారంలో పాల్గొనాలని, వారిని ఇంచార్జీలు నిశితంగా పరిశీలిస్తారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.