సీ-ఓటర్ సర్వేలో ఊహించని ఫలితాలు.. తెలంగాణలో ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నిక సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. అయితే.. ఆ రోజు ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందో తెలియదు. కానీ.. సీ-ఓటర్ సర్వే (ABP CVoter Opinion Polls 2023) లో మాత్రం ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది.
Telangana Assembly Elections: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పండుగ షురూ అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ప్రకటనతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వెలువడుతాయో.. తెలియదు కాదు. కానీ, ఏబీపీ సీ-ఓటర్ సర్వే (ABP CVoter Opinion Polls 2023)ప్రకారం మాత్రం ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.
తెలంగాణ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా సాగుతాయనీ, ప్రధాన పోటీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొందని సీ-ఓటర్ సర్వే తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 48 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 స్థానాల్లో గెలుపు బావుటాను ఎగరవేసే అవకాశముందని అంచనా వేసింది. ఇక భారతీయ జనతా పార్టీ (బిజెపి) విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినా.. ఫలితంగా అంతగా ఉండకపోవచ్చుననీ, కేవలం 5 నుండి 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందే అవకాశముందని అంచనా వేసింది.
ABP-CVoter ప్రకారం.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా భారీగానే పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 39% ఓట్ల వాటాను పొందగలదనీ, అంటే.. కాంగ్రెస్ దాదాపు 10.5% ఓటింగ్ పెరిగే అవకాశముందట. ఆ తర్వాత అధికార BRS గతంలో కంటే.. 9.4% ఓట్ల వాటా తగ్గుదలతో 37% ఓట్లను పొంది, రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ఇక బిజెపి విషయానికి వస్తే.. 16% ఓట్లు వస్తాయనీ, గతంలో కంటే.. 9.3% ఓట్లు పెరుగుతాయని అంచనా.
తెలంగాణ ప్రధానంగా త్రిముఖ పోరు దిశగా దూసుకెళ్తోంది. అధికార పార్టీ BRS మరో దఫా అధికార పగ్గాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా.. సిఎం కేసీఆర్ ను గద్దె దించి..అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని దక్షిణాది ప్రాంతంలో కొంత పట్టు సాధించేందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తానికి ఈ సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో హంగ్ తప్పదనీ, కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 60 వస్తే.. అధికారం హస్తం పార్టీ సొంతమయ్యే ఛాన్స్ ఉందని, లేదా.. స్వతంత్రులు, ఇతరుల నుంచి మద్దతు లభిస్తే.. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో బీఆర్‌ఎస్ 88 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. 117 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక్కటి మాత్రమే గెలుచుకుంది.