తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. ఈ విషయాలు మీకు తెలుసా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెల్లడైంది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెల్లడైంది. ఈరోజు న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణతో సహా రాజస్తాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టుగా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించామని పేర్కొన్నారు. పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించామని చెప్పారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక గణంకాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
>> ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువు 2014 జనవరి 16తో ముగియనుంది.
>> తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో జనరల్ 88, ఎస్సీ 19, ఎస్టీ 12 ఉన్నాయి.
>> తెలంగాణలో మొత్తం 3, 17, 17, 389 మంది ఓటర్లు, అందులో.. పురుష ఓటర్లు- 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు- 1,58, 43, 339 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు- 2, 557 ఉన్నారు.
>> సర్వీస్ ఓటర్లు- 15, 338 మంది, ప్రవాస ఓటర్లు- 2, 780 మంది ఉన్నారు.
>> తెలంగాణలో పీవీటీజీ ఓటర్లు- చెంచులు, కొలామ్, తోటి, కొండారెడ్డి.. అర్హులైన మొత్తం ఓటర్లు- 39,186
>> తెలంగాణలో పురుషులు, మహిళల ఓటర్ల నిష్పతి.. 2018లో 1000: 982 ఉండగా.. ఇప్పుడు 1000: 998గా ఉంది.
>> తెలంగాణలో కొత్త ఓటర్లు-17,01,087, తొలగింపు- 6,10,694, సవరణలు- 6,24,051
>> 18-19 ఏజ్ గ్రూప్ మధ్య ఓటర్ల చేరిక సంఖ్య- 3,35,043
>> తెలంగాణ మొత్తం పోలింగ్ స్టేషన్లు..35, 356, ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సరాసరి ఓటర్ల సంఖ్య-897
>> మొత్తం పోలింగ్ స్టేషన్లలో 87,798 (78 శాతం) వెబ్ కాస్టింగ్ చేయనున్నారు.
>> మహిళల నిర్వహించే పోలింగ్ స్టేషన్లు-597, మోడల్ పోలింగ్ స్టేషన్లు-644, పీడబ్ల్యూడీకి చెందినవి-120.
>> తెలంగాణకు సంబంధించి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
>> వృద్ధులు, పీడబ్ల్యూడీ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ.. 80 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగుల కోసం హోమ్ ఓటింగ్ ఆప్షన్. ఇందుకోసం ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్:
మొత్తం స్థానాలు-119
నోటిఫికేషన్ విడుదల-నవంబర్ 3
నామినేషన్ల స్వీకరణ- నవంబర్ 3 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలిన- నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ గడువు- నవంబర్ 15
పోలింగ్ తేదీ-నవంబర్ 30
కౌంటింగ్ తేదీ- డిసెంబర్ 3