సారాంశం

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి(పీపీఏ) తెలంగాణ ప్రభుత్వం పోలవరం లేఖ రాసింది. తెలంగాణ భూభాగంపై పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌ను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది.

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి(పీపీఏ) తెలంగాణ ప్రభుత్వం పోలవరం లేఖ రాసింది. తెలంగాణ భూభాగంపై పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌ను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని భద్రాచలం పట్టణం, చుట్టుపక్కల గ్రామాలలో ముంపు భయం ఉందని పేర్కొంది. గత ఏడాది జూలైలో గోదావరికి వరదల సమయంలో పోలవరం వద్ద వరద ప్రవాహం సరిగ్గా లేక బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో భద్రాచలం పరిసరాల్లోని 28 వేల ఎక రాల సాగు భూమి ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రజలు పునరావాసంతోపాటు ఆస్తినష్టం వాటిల్లిందని, కోట్లాది రూపాయల నష్టం తలెత్తిందని లేఖలో పేర్కొంది. 

గత వారం రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. భద్రాచలం పట్టణం, చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని తెలంగాణ సర్కార్ కోరింది. ఈ లేఖను తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ రాశారు. 

తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు వారి వారి భూభాగాలపై పోలవరం ప్రాజెక్టు వల్ల బ్యాక్‌వాటర్‌ ప్రభావం, ముంపు ప్రభావంపై దాఖలైన పిటిషన్‌లను విచారించిన సుప్రీంకోర్టు.. బాధిత రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని గత ఏడాది సెప్టెంబర్ 6న పీపీఏ, సీడబ్ల్యూసీని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా పోలవరంలో నీటిని నిలిపివేయరాదని కోరారు. వాటర్‌ ఇయర్‌లో పోలవరం 48 గేట్లు, రివర్ స్లూయిజ్‌లు తెరిచే ఉంచాలని పేర్కొన్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేయాలని కోరారు. 

ఇక,  భద్రాచలం, మణుగూరులోని హెవీ వాటర్‌ ప్లాంట్‌ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని.. వాటిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, పీపీఏ సర్వే చేపట్టి రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తోంది.