ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా విద్యుత్ బకాయిల యుద్ధం తారా స్థాయికి చేరింది. మీరు ఇవ్వాలంటే మీరు ఇవ్వాలంటూ చివరకు డిస్కంలు న్యాయపోరాటానికి దిగాయి.

తెలంగాణ విద్యుత్ సంస్థలు తమకు చెల్లించాల్సిన మొత్తం రూ.5 వేల కోట్లు కాదని.. దాదాపుగా రూ.11,278 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రా నుంచి.. ఆంధ్రా విద్యుత్ సంస్థలకు తెలంగాణ నుంచి కరెంట్ సరఫరా అయ్యింది.

ఇందులో ఏపీ ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను సరఫరా చేసింది. ఇందుకు సంబంధించిన బ్యాలెన్స్ చెల్లించాల్సిందిగా నోటీసులు పంపింది. విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం జాప్యం జరిగినా అంటూ హుంకరించిన తెలంగాణ... బకాయిల చెల్లింపులో మాత్రం ధిక్కారాన్ని ప్రదర్శించింది

ఈ బకాయిలు చివరకు రూ.5 వేల కోట్లకు చేరాయి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ముందుకు రాకపోవడంతో.. ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాళా తీసినట్లుగా ప్రకటించాలని.. ఆంధ్రా విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించాయి.

వివాదం తారాస్థాయికి చేరడంతో ఆంధ్రప్రదేశ్ సంస్థలే తమకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. దీంతో ఏపీ సంస్థలు అందుకు కౌంటరిచ్చాయి.

మీడియా సమావేశంలో సీఎండి చెప్పినదంతా నిరాధారమని ఏపీ జెన్‌కో ఆర్ధిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ కంట్రోలర్ ఆదినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్థల పద్దు పుస్తకాల ప్రకారమే ఆంధ్రకు రూ.11,728 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

అందులో తాము చెల్లించాల్సిన బకాయిలను మినహాయించినా రూ.8,274 కోట్లు తమకు తెలంగాణ బకాయిపడిందని తెలిపారు. తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్‌కు గాను అన్ని సర్దుబాట్లు పోగా నికరంగా రూ.5,732.40 కోట్లు బకాయి రావలసి ఉందని చెప్పారు.

రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రకు తెలంగాణ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆదినారాయణ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ బకాయిల అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల మధ్య చర్చలు జరగుతూనే ఉన్నాయన్నారు.

ఆంధ్రకు బకాయిలు చెల్లించాలని ఆ సందర్భంగా అంగీకరించి... తక్షణ చెల్లింపుగా రూ.150 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించి.. ఇప్పుడు ఆంధ్రా సంస్థలే తమకు బకాయి పడినట్లు ప్రభాకర్‌రావు చెప్పడంపై ఆదినారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను తాము ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్రకు బకాయి పడకపోతే అవి లా ట్రిబ్యునల్‌ను కాకుండా ఈఆర్‌సీని ఎందుకు ఆశ్రయించాయని ఆయన నిలదీశారు.

కాగా... దివాలా కేసు ఈ నెల 20వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో విచారణకు రానుందని.... బకాయిల చెల్లింపుకు ఆ సందర్భంగా పట్టుబడతామని ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.