హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతు వేదికల ప్రారంభోత్సవాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల కాలంలో పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై అధికారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు గాను  వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోకుండా ఉండేందుకు గాను బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే రూ. 1000 ఫైన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిచేసే ప్రాంతాల్లో కూడ మాఃస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.