మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇండోనేషియా, మలేషియాలు ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలను అందుకుంటున్నాయని.. మన రాష్ట్రంలో దీని సాగును పెంచుతామని మంత్రి తెలిపారు.
అన్నదాతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి (telangana agriculture minister) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) . వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ప్రజల జీవన విధానంలో ఆహారంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా రైతులు తృణధాన్యాలు, ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా నూనె గింజల కొరత తీవ్రంగా వుందని.. దీనిని దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో నూనె గింజల సాగు పెరగాలని మంత్రి ఆకాంక్షించారు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు (oilpam) అడుగులు వేస్తున్నామని.. ఆయిల్ ఫామ్‌లో 168 రకాల ఉప ఉత్పత్తులు వుంటాయని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుతో మలేషియా, ఇండోనేషియాలు మంచి ఆదాయాన్ని అందుకుంటున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయానికి అన్ని రకాల వసతులు వున్నాయని.. అన్నదాతలు భిన్నమైన పంటలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
