Dalit Bandhu scheme: కరీంనగర్‌లో దళిత బంధు పథకం కింద 769 వాహనాలను పంపిణీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ప్రజా సంక్షేమ కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
Dalit Bandhu scheme: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన సంక్షేమ పథకాల్లో దళిత బంధు ఒకటి. ఈ పథకం కింద తాజాగా కరీంనగర్‌లో 769 వాహనాలను పంపిణీ చేశారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దళితులకు వాహనాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 769 ఆటోమొబైల్స్ అందించారు. వీటి మొత్తం విలువ రూ. 94.84 కోట్లు అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్‌రామ్‌ల ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే దళితుల ఆర్థిక స్థితిగతుల మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
"దేశంలోని అత్యంత దుర్బలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న అనేక సామాజిక వర్గాల పౌరులను ఉద్ధరించే లక్ష్యంతో అనేక సామాజిక కార్యక్రమాలను అవలంబించడం ద్వారా తెలంగాణ పరిపాలన దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్న దళితులు ఇప్పుడు రవాణా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు" అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. "దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా 94.84 కోట్ల రూపాయల విలువైన 769 వాహనాలను హుజరాబాద్ నియోజకవర్గ 1041 దళిత బంధు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాం" అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అన్నారు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో 34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,960 చొప్పున మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రత్యేకంగా రైతులకు తెలియజేశారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్ముకోవాలని కోరారు. మధ్యవర్తులకు విక్రయించవద్దని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిల్వలను కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల నుంచి స్టాక్స్ రాకుండా కీలక ప్రదేశాల్లో 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పండి ధాన్యం మాత్రమే రాష్ట్ర కొనుగోలు కేంద్రాల్లో కొంటామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న వెంటనే వారి వివరాలను డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శిస్తామని, రైతులకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పంపిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ధాన్యం సేకరణ కసరత్తు కోసం దాదాపు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం దాదాపు 1.60 కోట్ల బస్తాలు సంబంధిత శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిల్వ కేంద్రాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలతో పాటు అవసరమైన సంఖ్యలో బస్తాలను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
