తెలంగాణ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే.. వికారాబాద్ జిల్లాలో పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు వరంగల్‌లో పదో తరగతి హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్ గ్రూప్‌ల్లో ప్రశ్నపత్రం వైరల్ కావడంతో.. విషయం తెలుసుకన్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రశ్నాపత్రం ఒర్జినలా? నకిలీనా అనేది కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు. ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే పేపర్ బయటకు వచ్చింది. అయితే అది ‘లీక్’ కాదని.. బయటి వ్యక్తులెవరూ పేపర్‌ను యాక్సెస్ చేయలేదని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు తెలుగు పరీక్ష ప్రారంభం కాగానే తాండూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్ ఎస్ బండప్ప తన మొబైల్ ఫోన్‌లో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి 9.37 గంటలకు మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు పంపారు. ఉపాధ్యాయుల్లో ఒకరు పొరపాటున ప్రశ్నపత్రం ఫోటోను కూడా స్థానిక మీడియా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత దానిని తొలగించాడు.
ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఇన్‌ఛార్జ్ ఎస్పీ మురళీధర్ విచారణ చేపట్టారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, శాఖ అధికారి కె.గోపాల్, బండప్ప, సమ్మప్పలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణపై చిత్తశుద్దిలో రాజీ పడలేదని అన్నారు. ఇన్విజిలేటర్ బండప్ప వ్యక్తిగతంగా చేసిన పని అని చెప్పారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అధికారులు తెలిపారు.
