Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 17న కాంగ్రెస్ బహిరంగ సభకు వేదిక ఖరారు.. భారీ అంచనాలు పెట్టుకున్న టీపీసీసీ..!!

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు.

Telangan Congress to held public meeting in tukkuguda on septembr 17th sonia gandhi will ateend ksm
Author
First Published Sep 7, 2023, 1:51 PM IST

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. ఈ సభా వేదికపై నుంచే సోనియా గాంధీ.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నట్టుగా టీపీసీసీ తెలిపింది.  తాజాగా ఇందుకు సంబంధించిన సభా వేదికను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌‌లో కాకుండా తుక్కుగూడలో ఓ ఖాళీ స్థలంలో సభ నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు సంబంధించి అనుమతుల కోసం రక్షణ శాఖకు కూడా లేఖ రాసింది. 

అయితే సెప్టెంబర్ 17వ తేదీనే పరేడ్ గ్రౌండ్స్‌లో అమృత్‌ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియంలో సభకు అనుమతి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే 10 లక్షల మందితో సభ నిర్వహించాలని భావించిన టీపీసీసీ ఎల్బీ స్టేడియం.. సభకు అనుకూలంగా ఉండదనే నిర్ణయానికి వచ్చింది. 

ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ఈ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌తో పాటు పలువురు నేతలతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. అయితే చివరకు తుక్కుగూడలోని ఖాళీ స్థలంలోనే సెప్టెంబర్ 17న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. 

ఇక, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో 16న సీడబ్ల్యూసీ, 17న పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. 17వ తేదీ సమావేశం అనంతరం.. సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు సోనియా హాజరుకానున్నారు. అయితే ఈ సభపై టీపీసీసీ భారీ అంచనాలు పెట్టుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios