ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మనస్తాపం చెంది ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 

శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. 

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగారు. అయితే సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ సైతం ప్రకటించారు. 

సీఎం కేసీఆర్, మంత్రుల ప్రకటనలతో మనస్తాపం చెందిన దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివివారం ఉదయం మరణించారు. ఇకపోతే శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.