ఇటీవల తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చంద్‌ టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించారు.

మల్లన్నకు..  బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ‌ ప్రజల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు తీన్మార్ మల్లన్న.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలోనూ ఆయన పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో సాగర్‌లో పోటీపై తీన్మార్‌ మల్లన్న క్లారిటీ ఇచ్చారు.

ఉప ఎన్నికలో తాను పోటీచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారంలో ఆదివారం నిర్వహించిన సభలో తన భవిష్యత్‌ కార్యాచరణను నవీన్ ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 6 వేల కి.మీ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. తీన్మార్‌ మల్లన్న టీమ్‌ పేరిట రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు.