ఓ ఆకతాయి యువకుడు ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధింపులకు గురి చేయడాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా యువతిని ఇంట్లోకి చొరబడి మరీ ఈ ఆకతాయి బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి లోనై ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో రచన(20) అనే యువతి డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతోంది. ఈమె సైలాన్ బాబా నగర్ లో తల్లిదండ్రులతో కలిసి సివాసం ఉంటోంది. అయితే కాలేజీకి వెళ్లే దారిలో ఈ యువతిని రవితేజ అనే యువకుడు వెంటపడేవాడు.కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ వేధింపులకు దిగుతున్నా సహించిన యువతి అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వాళ్లు రవితేజను పట్టుకుని గట్టిగా వార్కింగ్ ఇచ్చి వదిలేశారు.దీంతో అతడు రచపై కోపాన్ని పెంచుకున్నాడు.

ఎంత హెచ్చరించినా రవితేజ ప్రవర్తన మార్చుకోకపోవడంతో తల్లిదండ్రులే రచనను కాలేజీ మాన్పించారు. అయితే  తల్లిదండ్రులు తమ పనులపై బైటికి వెళుతుండటంతో రచన ఇంట్లోనే ఒంటరిగా ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న రవి ఏకంగా యువతి ఇంట్లోకి చొరబడీ మరీ మరోసారి ప్రేమించాలంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిపోవడంతో పాటు ఇంట్లోకి అతడు ప్రవేశించడాన్ని ఇరుగు పొరుగు వారు చూశారని రచన తీవ్ర మనస్థాపానికి గురయ్యింది.

దీంతో రచన దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. కూతురి ఆత్మహత్య గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణానికి కారణమైన రవితేజ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.