టెలిగ్రాంలో చైల్డ్ పోర్నోగ్రఫీ... క్యూఆర్ కోడ్ తో డబ్బులు వసూలు.. టెకీ అరెస్ట్..
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఓ టెకీ తన ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లలో child pornography వీడియోలను వివిధ వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకున్నాడు. రెండు telegram
groups ను క్రియేట్ చేశాడు. ఆ గ్రూపుల్లో చైల్డ్ పొర్నోగ్రఫి వీడియోలను షేర్ చేశాడు.
కరీంనగర్ : సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఇతరులకు షేర్ చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎంతకైనా తెగించేలా చేస్తుంది.. ఎలాంటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తుంది. ఇక చేతిలో సాంకేతికత అందుబాటులో ఉంటే.. ఇది విశృంఖలంగా మారుతుంది.
ఉచ్ఛనీచాలు మరిచి, విచక్షణ కోల్పోయి ఎంతటికైనా తెగిస్తారు. అలాంటి పనే చేశాడు ఆ Techie కూర్చున్నచోటే కదలకుండా డబ్బులు సంపాదించాలన్న యావతో నీచానికి దిగజారాడు. చాలా తెలివిగా వ్యవహరించాననుకున్నాడు. తన ఐడెంటిటీ తెలియదనుకున్నాడు. కానీ చివరికి సైబర్ కళ్లకు దొరికిపోయాడు. ఇప్పుడు నేరస్తుడిగా మారి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన వంగల మధుకర్ రెడ్డి (23) హైదరాబాద్ లో ఓ ఐటీ కంపెనీలో software engineerగా పనిచేస్తున్నాడు.
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంలో భాగంగా నుస్తులాపూర్ లోని తన నివాసంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించేందుకు తన ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లలో child pornography వీడియోలను వివిధ వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకున్నాడు. రెండు telegram groups ను క్రియేట్ చేశాడు. ఆ గ్రూపుల్లో చైల్డ్ పొర్నోగ్రఫి వీడియోలను షేర్ చేశాడు.
తన గుర్తింపు తెలియకుండా క్యూఆర్ కోడ్ ను పంపించేవాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేశాడు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ మహిళా భద్రతా విభాగం, సీఐడీ అధికారులు గుర్తించారు. లోయర్ మానేరు డ్యాం పోలీసులకు సమాచారం అందించారు.
వారి సహకారంతో నుస్తులాపూర్ లో మధుకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మీద pocso actతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏసీపీ విజయసారథి తెలిపారు.