తెలంగాణలో ఐటి మంత్రి ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం కేటిఆర్ అని. ఐటిలో కేటిఆర్ చాలా యాక్టీవ్ గా కూడా ఉంటారు. ఎవరైనా ట్విట్టర్ లో సమస్యలు పెడితే వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తారన్న పేరు కూడా ఉంది. సాంకేతికను సద్వినియోగం చేసుకుని ఐటి శాఖకు వన్నె తెచ్చారన్న పేరుంది.

ఇక మంత్రి హరీష్ రావు గురించి చెప్పగానే ఆయన ఎప్పుడు చూసినా ప్రాజెక్టులు అంటూ ఊర్ల పొంట తిరుగుతుంటారు. అర్థరాత్రి, అపరాత్రి ఆయన గ్రామాల్లో, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఉంటారు. ఐటి ఆయన పెద్దగా వినియోగిస్తారని ఎవరికీ తెలియదు. కేటిఆర్ సూటు, బూటు వేసుకుని కొత్తతరం నాయకుడిగా ఉంటే హరీష్ మాత్రం పాత తరం నాయకుడిగానే సాదాసీదాగా ఉంటారు.

అలాంటి హరీష్ రావు టెక్నాలజీని ఎలా వాడారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అ వివరాలేంటో చదవండి. తెలంగాణలో అకాల వర్షాలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ శాఖతోపాటు మార్కెటింగ్ శాఖ కూడా హరీష్ రావే చూస్తున్నారు కదా. కానీ ఆయన గత రెండు రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్టు పనులు తనిఖీ చేస్తూ ఫీల్డ్ లోనే ఉండిపోయారు. దీంతో అకాల వర్షాలు రావడంతో ఆయన వెంటనే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యం కూడా కొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కు ఆదేశాలు ఇచ్చారు. ఇది బాగానే ఉంది కానీ.. మంత్రి హరీష్ రావు ఈ సమీక్ష ఎలా చేశారో తెలుసా? ఆయన వాట్సాప్ ద్వారా సమీక్ష జరిపి అప్పటికప్పుడు మార్కెటింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి హరీష్ రావు వాట్సాప్ లో సమీక్ష జరపడం కొత్త పరిణామంగా చెబుతున్నారు.

మంత్రి పేషీ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ కింద ఉంది. యదాతదంగా ఇస్తున్నాం. చదవండి.

గత రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తనికీ చేస్తున్న మంత్రి హరీష్ రావు అకాల వర్షాల్ నేపథ్యం లో మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ని గురువారం whatsapp ద్వారా సమీక్షించారు. ఎప్పటికప్పుడు మార్కెటింగ్ శాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మార్కెటింగ్ అధికారులను, మార్క్ ఫెడ్ అధికారులను, వేర్ హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ రోజు కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో మరియు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన సరుకుల గురించి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను మరియు మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నరు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులను, కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను మరియు జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. టార్పాలిన్ లను వెంటనే సమకూర్చి తడవని సరుకులను వెంటనే గోదాం లకు తరలించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు. గాలి దుమారానికి,  భారీ వర్షానికి గోదాముల పై ఉన్న రేకులు ఎగిరిపోయినందున వాటికి వెంటనే మరమ్మత్తులు చేయాలని  మార్కెటింగ్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.