మహబూబ్ నగర్: అతి వేగం టెక్ దంపతుల ప్రాణాలు తీసింది. అతి వేగంతో దూసుకెళ్తున కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాఫ్ట్ వేర్ దంపతులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఆమ్రమాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం, హైదరాబాదు ప్రధాన రహదారిలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీ టెక్ మహీంద్రలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న అంజిరెడ్డి (30), తన భార్య అశ్విని (28)లు అదే కంపెనీలో పనిచేస్తున్న మరో నలుగురు అలీ, కిశోర్ కుమార్ రెడ్డి, రవికిరణ్, రూకేష్ లతో కలిసి శ్రీశైలం బయలుదేరారు. 

దోమలపెంట ్టవీ చెక్ పోస్టు కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి, అశ్విని అక్కడికక్కడే మరణించగా, అలీ, కిశోర్ కుమార్ రెడ్డి, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిని సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని చికిత్స నిమిత్తం హైదరాబాదు తరలించారు. ప్రమాదం నుంచి రూకేష్ క్షేమంగా బయటపడ్డాడు.

అంజిరెడ్డి, అశ్వినిలకు పది నెలల క్రితమే వివాహమైంది. ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన అంజిరెడ్డి శ్రీశైలంలో దైవదర్శనం తర్వాత స్వగ్రామానికి వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యుదేవత కబళించింది.