సర్కారు పెడుతున్న అడ్డగోలు నిబంధనలు ప్రభుత్వ ఉపాధ్యాయుడవుదామనుకుంటున్న అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. వేల రూపాయిలు కోచింగ్ లకు కట్టి... పదులు సంఖ్యలో పరీక్షలు రాస్తే వెయిటేజీ మార్కులు లేవంటున్నారు.. ఇంగ్లీష్ లోనే పరీక్ష అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన వేళ ఉద్యోగాల జాతర మొదలవుతోందని సంబురపడిన అభ్యర్థులకు నిరాశే మిగులుతోంది.రెండున్నరేళ్లు దాటినా అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్లే రాలేదు. ఇక ఏన్నో ఏళ్లుగా వేచిచూసినా డీఎస్సీ ఊసే లేకుండా పోయింది.ఇటీవల గురుకులాలకు సంబంధించి భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఉద్యోగ పరీక్ష కు సంబంధించి ప్రభుత్వం పెట్టిన నింబధనలు చూసిన అభ్యర్థులంతా ఇప్పుడు తెల్లబోతున్నారు.గురుకులాలకు సంబంధించి దశలవారిగా 12 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం టీఎస్ పీయస్సీకి అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
గత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పోస్టుల భర్తీ ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో టీఎస్ పీయస్సీ సెలబస్ ను మార్చేసింది. అంతేకాదు కొత్త నిబంధనలను కూడా తీసుకొచ్చింది.
ఉపాధ్యాయ నియామక పరీక్షలు రాసేవారికి టెట్ ను అర్హత పరీక్షగా కేంద్రం నిర్ణయించింది. టీచర్ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఇస్తున్నారు. దీంతో బీఎడ్, డీఎడ్ చేసినా అభ్యర్థలు ఇన్నాళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోయినా టెట్ లో మార్కులు పెంచుకునేందుకు ప్రతిసారి దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. దీని కోసం వేలరూపాయిలు కోచింగ్ సెంటర్లకు తగిలేస్తున్నారు.
ఇప్పడు గురుకులాల పోస్టులకే కాదు డీఎస్సీకి కూడా టెట్ మార్కులు కలిపేది లేదని టీఎస్ పీయస్సీ స్పష్టం చేస్తుంది.దీంతో ఇన్నాళ్లు ఒక్క మార్కు పెరిగినా చాలు అనుకొని చాలాసార్లు టెట్ రాసిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవతున్నారు.
ఇక టెట్ ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష రాయడానికి అర్హత పరీక్షగానే ఉండనుంది. బయటి పరీక్షల మార్కులకు టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగ పరీక్షల్లో వెయిటేజీ ఇవ్వడం కుదరదు. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే టెట్ వెయిటేజీని ఎత్తేసినట్లు టీఎస్ పీయస్సీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థులకు షాకిచ్చేలా మరో నిబంధన కూడా టీఎస్ పీయిస్సీ తీసుకొస్తోంది. గురుకుల పోస్టుల నియామక పరీక్షను ఇంగ్లీష్ లోనే నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇది నిజంగా అభ్యర్థుల పాలిట శరాఘాతమే.
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులే అత్యధికంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలనుకుంటారు. ప్రస్తుతం బీఎడ్, డీఎడ్ చేసిన వారిలో 90 శాతం మంది తెలుగు మీడియం విద్యార్థులే. ఇప్పుడు పరీక్ష ఇంగ్లీష్ లో పెడితే వాళ్ల పరిస్థితి ఏంటి.ఇన్నాళ్లు తెలుగు మీడియంలో చదువుకొని, తెలుగు మీడియంలోనే కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఈ విధానం వల్ల భారీగా నష్ట పోయే ప్రమాదం ఉంది.
ఈ ఒక్కసారికి ఇంగ్లీష్ నిబంధనలో సడలింపు ఇవ్వాలన్నది అభ్యర్థుల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. దేశంలో కలెక్టర్ కావడానికి రాసే ఏఐఎస్ పరీక్షను కూడా మాతృభాషలో రాసుకునే వీలుంటుంది. అలాంటిది ఉపాధ్యాయ పోస్టులకు ఇలాంటి నిబంధన విధించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇక డీఎడ్ అభ్యర్థుల కష్టాలు మరోరకంగా ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎస్సీ ఊసే లేదు. ఇప్పుడు గురుకుల నియామకాలు పడినా అందులో డీఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం లేదు. టీజీటీ, పీజీటీ పోస్టులకు కేవలం బీఎడ్ అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5వ తరగతి నుంచి గురుకులాలలో బోధన ఉంటుంది. అలాంటప్పడు తమకు ఎందుకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వరూ అనేది వారి ప్రశ్న. అంతేకాకుండా గతంలో సుప్రీం కోర్టు ఐదవ తరగతి లోపు బోధించే ఉపాధ్యాయపోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు డీఎడ్ అభ్యర్థులకు పరీక్షకు అనుమతివ్వకపోతే సుప్రీం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.
