Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో టిడిపి లోతుపాతులు కొలవాలనుకుంటున్న లోకేశుడు

  • టిడిపిలో చేరేందుకు తెలంగాణా ప్రజలు మునుపటి లాగే ముందుకొస్తారా?
  • నవంబర్ నుంచి సభ్యత్వ నమో దు కార్యక్రమం
  • లోకేశ్ నాయకత్వానికి మరొక  టి-పరీక్ష
TDP to test its influence in Telangana again

నారా లోకేశుడికి తెలంగాణాలో మరొక సంకటం వచ్చి పడింది. ఆయనిపుడు తెలంగాణాలో తెలుగుదేశం లోతుపాతులు కొలవాలనుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీనుంచి ఆయన సైన్యం రంగంలోకి దిగుతా వుంది  బ్రాండ్ న్యూ మిషన్లు పట్టుకుని. ఉన్నోళ్లు వూడతారో, ఉత్సాహంగా కొత్తవాళ్లు సభ్యత్వం తీసుకుంటారో చూడాలి.

 

జిహెచ్ ఎం సి ఎన్నికల్లోబాగా గాయపడ్డ తర్వాత  ఆయన తెలంగాణా గురించి మాట్లాడటం బాగా తగ్గించారు. మకాం గుంటూరుకు మార్చారు. పర్మనెంట్ అడ్రసు హైదరాబాదే  అయినా  ఎపుడొస్తున్నారో, ఎపుడు వెళ్లి పోతున్నారో కూడా తెలియనంతా గోప్యంగా వ్యవహారం జరిగిపోతున్నది. పర్వాలేదు, పార్టీలో ఎంత మంది చేరాలనుకుంటున్నారో ఆయన కనుక్కోవాలనుకుంటున్నారు.

 

ఆయన సంగతే కాదు, ఆ ఎన్నికల తర్వాత  తెలుగుదేశం భాష యాస పూర్తిగా మారిపోయింది. అంతకుముందు అవకాశం దొరికినపుడల్లా 2019 నాటికి అక్కడ ఇక్కడ అధికారమే అనే వాళ్లు. ఇపుడలాంటి మాటలు మాట్లాడటం లేదు. అధికారం సంగతేమో గాని,  పార్టీ ఉనికే కష్టంగా ఉందనుకుంటున్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్ లోకి ఉడాయించేశారు.

 

పోయింది నాయకులేగాని, సైనికులుకాదని తెలుగుదేశం అవశేష నేతలు సమర్థించుకున్నారు.అయితే, తెలంగాణా పార్టీ లో ఎంతమంది సైనికులున్నారో లెక్క చూసుకునే మహదవకాశం తెలుగుదేశం జాతీయ  ప్రధాన కార్యదర్శికి ఇపుడు దొరికింది.

TDP to test its influence in Telangana again

 

నవంబర్ ఒకటో తేదీనుంచి  తెలంగాణాలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఆషామాషీగా కాదు,  ఈ సభ్యత్వ నమోదు హైటెక్ పద్ధతిలో జరుగుతుందని చెబుతూ ఆ మెషిన్లను లోకేశ్ బాబు ట్విట్టర్ లో  పెట్టారు.

 

తెలుగుదేశం వర్గాలు చెప్పేదాని ప్రకారం, తెలంగాణా సభ్యత్వం మీద  పార్టీకి పెద్ద గా ఆశల్లేవు. ఉన్న సభ్యత్వం కాపాడుకుంటే చాలనుకుంటున్నారు. గతంలో తెలంగాణాలో పదిలక్షల మంది సభ్యులుండేవారట. ఈ సారి 12 లక్షల టార్గెట్ పెట్టారట.

 

ఆ టార్గెట్ అందుకోవడం  కూడా కష్టమని  ఆఫ్ ద రికార్డులో  అంగీకరిస్తున్నారు. గతంలోఉన్న వాళ్లంతా నమోదుచేయించుకుంటే అదే పదిలక్షలంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో బాహాటంగా టిడిపి సభ్యత్వం తీసుకునేందుకు ముందుకురారని,  వంద రుపాయల కే ఇన్య్యూరెన్స్ వంటి రాయితీలు ఇచ్చిన తెలంగాణాలో సభ్యత్వ నమోదు కష్టం కావచ్చని  టిడిపి నాయకుడొకరు చెప్పారు.

 

ఆంధ్రలో ప్రభుత్వం ఉంది కాబట్టి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపవచ్చు. ఇక్కడ ప్రభుత్వం లేకపోవడమేకాదు, రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా లేదు. అందువల్ల పదిలక్షల మంది మిగిలితే చాలు. సభ్యత్వం పడిపోవడం మంచి సిగ్నల్ కాదు,అని ఆయన అన్నారు. ఆంధ్రలో గత ఏడాది ఆంధ్రలో 40 లక్షల మంది సభ్యత్వం ఉండేది. ఈ సారి దీనికి 50 లక్షలకు పెంచాలనుకుంటున్నారు.

 

అధునిక యంత్రాలు   వాడుతున్నందున సభ్యత్వం పెరిగినా పెరగవచ్చేమో, టెక్నాలజీ యుగం మరి. ఎవరో పెద్ద మనిషి ’రిపబ్లిక్ ఆఫ్ టెక్నాలజీ’ అని కూడా అనేశాడు. వోటింగ్ మిషన్లు పార్టీలనుగెలిపిస్తున్నాయని అనుమానిస్తున్న రోజులలో సభ్యత్వాన్ని పెంచడం  మిషన్లకొక లెక్కా???

 

Follow Us:
Download App:
  • android
  • ios