Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను కలిసిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ: త్వరలో టీఆర్ఎస్ లోకి జంప్

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ఆయన కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కు వచ్చారు.

TDP Telangana president L ramana meets KCR at Pragathi Bhavan
Author
Hyderabad, First Published Jul 8, 2021, 8:40 PM IST

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎల్. రమణ గురువారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావును కలుసుకున్నారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ లో వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఎల్. రమణ త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రమణను ప్రగతి భవన్ కు తీసుకుని వచ్చారు. రమణతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ సాన్నిహిత్యం దృష్ట్యా ఎల్ రమణతో చర్చలు జరిపి టీఆర్ఎస్ లోకి తీసుకుని వస్తున్నారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వదిలి బిజెపిలో చేరిన నేపథ్యంలో ఎల్ రమణను కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రమణ బలమైన నాయకుడు. ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి ఎల్. రమణ చేరిక ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. 

చాలా కాలంగా టీఆర్ఎస్ నేతలు ఎల్ రమణతో మాట్లాడుతున్నారు. ఇటీవల రమణ మీడియా సమావేశం పెట్టి తాను పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చివరకు ఆయన టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది.

ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పెద్ద దెబ్బనే అవుతుంది. తెలంగాణలో టీడీపీ తన ఉనికిని కూడా చాటుకోలేని స్థితిలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios