ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి రోజుకో షాక్ తగులుతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి.. వైసీపీలో చేరిపోయారు. తాజాగా.. తెలంగాణలోనూ పార్టీని వీడే నేతలు పెరిగిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. సీనియర్ నేతలంతా కొందరు టీఆర్ఎస్ లోకి, మరికొందరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే పార్టీలో మిగిలారు. ఇప్పుడు వారు కూడా ప్రత్యామ్నాయం వెదుకుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో రెండున్న ర దశాబ్ధాలుగా క్రియాశీల నేతగా ఉన్న తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీని 
వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శనివారం గజ్వేల్ లోని వైష్ణవీ గార్డెన్ లో కార్యకర్తలు, అభిమానుల తో సమావేశం ఏర్పాటు చేసి.. వారి సమక్షంలోనే పార్టీకి రాజీనామా చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకి సన్నిహితునిగా పేరున్న వంటేరు..స్వస్థలం గజ్వేల్‌ మండలం బూరుగుపల్లి. గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

కాగా.. తెలంగాణలో పార్టీ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోవడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం పార్టీకి రాజీనామా చేయనున్నారు.