కేసిఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పిండు

First Published 16, Nov 2017, 11:43 AM IST
tdp mla sandra alleges KCR backed out on the promise given to Telangana journalists
Highlights
  • ఎన్నికలప్పుడే జర్నలిస్టుల ఇండ్ల ముచ్చట గుర్తొస్తది
  • ఎన్నికలు అయిపోతే పట్టించుకోరు
  • జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు అదిగో, ఇదిగో అన్నారు
  • సింగరేణి ఎన్నికల ముందు మరో హామీ ఇచ్చారు
  • ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు

తెలంగాణ సిఎం కేసిఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన మాట మరోసారి తప్పిండని విమర్శించారు టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని గతంలో జిహెచ్ ఎంసి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని, సకల సౌకర్యాలు అందులో ఉండేలా చూస్తానని కేసిఆర్ జర్నలిస్టు నేతలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ముచ్చటే మరచిపోయిండన్నారు.

ఆ హామీ అలా ఉంటే.. తర్వాత సింగరేణి ఎన్నికల సందర్భంగా మళ్లీ జర్నలిస్టుల ఇండ్ల విషయంలో కేసిఆర్ మరోక ప్రకటన చేశారని అన్నారు. సింగరేణి ఎన్నకల ముందు 20 25 రోజుల్లోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేస్తున్నామంటూ తీపి కబురు చెప్పి ఇప్పటి వరకు దిక్కు దివానం లేదని విమర్శించారు. ఇప్పటికే రెండు సందర్భాల్లో జర్నలిస్టులకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అంతకంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు స్థలాలిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు సండ్ర.

జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా అమలు చేయడంలేదని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించి అందులో 20 కోట్లు ఖర్చు చేశామంటున్నారని, వాటిని ఎందుకు ఖర్చు చేశారో వివరణ ఇవ్వాలన్నారు. కనీస వేతనాలు అమలుకు వేసిన కమిటీ రిపోర్ట్ ఏమి చేశారో తెలియచేయాలన్నారు. సామాన్య ప్రజానీకాన్ని మాటలతో మభ్యపెడుతున్న రీతిగానే జర్నలిస్టులను కూడా మభ్య పెట్టడం బాధాకరమన్నారు. ఈ విషయంలో సర్కారు తీరు పట్ల జర్నలిస్టులు తీవ్ర ఆవేదనతో అసంతృప్తితో ఉన్నారని సండ్ర చెప్పారు.

జర్నలిస్టులు వారి సంక్షేమంపై అసెంబ్లీలో గురువారం టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య ‘ఏషియానెట్’ తో జర్నలిస్టుల సమస్యలపై ముచ్చటించారు. తెలంగాణ కోసం ముందుండి పోరాడిన తెలంగాణ జర్నలిస్టులకు సర్కారు మొండిచేయి చూపిందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయంటే జర్నలిస్టుల ఇండ్లు, స్థలాలు ఈ ప్రభుత్వానికి గుర్తొస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులను గౌరవించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

loader