హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నేత నుంచి సెగ తగిలింది. వెంకటేశ్వ రావు అనే తెలంగాణ టీడీపీ నాయకుడు హైదరాబాదులోని చంద్రబాబు ఇంటి ముందు ధర్నాకు దిగారు. 

30 ఏళ్ల పాటు పార్టీకి సేవలు చేసినప్పటికీ తనను పట్టించుకోవడం లేదని వెంకటేశ్వర రావు విమర్శించారు. చంద్రబాబు తాను కలువడానికి సమయం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. టీడీపీ నేతలు తనకు అందుబాటులో ఉండడం లేదని ఆయన అన్నారు. 

చంద్రబాబు తనను వాడుకుని వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర రావు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కార్పోరేటర్ గా పోటీ చేసిన ఓడిపోయారు. 

అయితే, వెంకటేశ్వర రావు విమర్శలను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఖండించారు. కావాలనే వెంకటేశ్వర రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చంద్రబాబుకు తెలంగాణ టీడీపి నేత నుంచి వ్యతిరేకత ఎదురుకావడం విశేషం.