హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తేలడంతో పార్టీల వద్ద ఆందోళన పర్వానికి తెరలేచింది. ఇప్పటి వరకు టిక్కెట్ దక్కని కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా అసంతృప్తి సెగ టీడీపీని తాకింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీలో అసంతృప్తి ఉప్పెనలా వెలసింది. టిక్కెట్ దక్కని ఆశావాహులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థుల మద్దతు దారులు తమ నాయకుడికి టిక్కెట్ ఇవ్వాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. 

తాజాగా శేరిలింగపల్లి టిక్కెట్ ను మువ్వా సత్యనారాయణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్మాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఆ యువకుడిని అడ్డుకున్నారు. 

తెలుగుదేశం పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన మువ్వా సత్యనారాయణను కాదని పారిశ్రామిక వేత్త భవ్య ప్రసాద్ కు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి శేరిలింగంపల్లి కంచుకోట అని అలాంటిది ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ కేటాయించడాన్ని కార్యకర్తలు తప్పుబడుతున్నారు. 

టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మహాకూటమిలోని కొందరు నేతలు డబ్బులకు అమ్ముడుపోయి శేరిలింగంపల్లి టిక్కెట్ ను పారిశ్రామిక వేత్త భవ్య ప్రసాద్ కు కేటాయించారని ఆరోపించారు. భవ్యప్రసాద్ ఓటమి తథ్యమన్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి మువ్వా సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.