Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యాడు: ఆ కోట్లకు లెక్కలేవి?: రేవూరి ప్రకాశ్ రెడ్డి

సెప్టెంబర్ 2న  టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించబోయే ప్రగతి నివేదన సభలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలపై జవాబు చెప్పాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు


.
 

tdp leader revuri prakash reddy fires on kcr
Author
Hanamkonda, First Published Aug 24, 2018, 5:44 PM IST

 సెప్టెంబర్ 2న  టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించబోయే ప్రగతి నివేదన సభలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలపై జవాబు చెప్పాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఇవాళ ప్రకాశ్ రెడ్డి హన్మకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చిందని,  అయితే గత 4 సంవత్సరాల 3నెలల పాలనలో ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఏమాత్రం నమ్మకం,విశ్వాసం ఉన్నా ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభలో వెల్లడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవూరి సవాల్ విసిరారు. 

ఎన్నికల మేనిఫెస్టో తనకు భగవద్గీత అనీ, రోజూ తన టేబుల్  డ్రా లో పెట్టుకుని చూస్తారని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ మేనిపెస్టోలోని 14వ పేజీలో పొందుపర్చినట్లు బలహీనవర్గాల వారికి గృహ నిర్మాణాలు చేపట్టారా? అని ప్రశ్నించారు.  ఈ హామీలు ఏమయ్యాయని తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నట్లు రేవూరి తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 125 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన వాగ్దానం 4 సంవత్సరాలుగా 3 నెలల పాలన గడిచినా ఇప్పటివరకు నెరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం 2,37,000 ఇల్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని గృహనిర్మాణ హామీ ఇస్తే ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 5,183 మాత్రమేనని రేవూరి తెలిపారు. మిగిలినవి ఏ విధంగా పూర్తి చేస్తారో? ఎన్ని సంవత్సరాలు అవుతుందో చెప్పాలని ప్రకాశ్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కేసీఆర్ కోల్పోయాడని రేవూరి అన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి కి చెందిన సొంత నియోజకవర్గంలో ఒక్క ఇల్లు నిర్మించలేదన్న రేవూరి, మొత్తం తెలంగాణలోని 31 జిల్లాల్లో 15 జిల్లాల్లో ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదన్నారు. ఇది నిరుపేదలను మోసం చేయడమేనని ప్రకాష్ రెడ్డి అన్నారు.

గృహ నిర్మాణం పేరుతో హడ్ కో నుండి రూ.1,200 కోట్లు ప్రభుత్వము డ్రా చేసిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్రం 1,86,786 ఇళ్లను మంజూరు చేస్తూ రూ.1,594 కోట్లు నిధులు విడుదల చేసిందని అన్నారు. ఇలా మొత్తం రూ.2,794కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.  

2015 జనవరి నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వరంగల్ లో రెండు రాత్రులు మూడు రోజులు గడిపి ఆరు మురికివాడల్లో పర్యటించి జి ప్లస్ వన్ ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవ సమయంలో మీరు దావత్ ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.  

ప్రగతి నివేదిక  సభలో ప్రభుత్వపరంగా వైట్ పేపర్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు లేనట్లయితే ప్రజలు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో  తరిమికొడతారని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు

ఈ విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సంతోష్ నాయక్,  ఎస్సీ సెల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అనుమకొండ సాంబయ్య,   గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏండి రహీం, రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి జయపాల్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, టిఎస్ఎన్వి రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్, ఇతర నాయకులు బానోతు వీరన్న నాయక్, ఈశ్వర్ ఆచారి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios